03 December 2009

హృదయరాగాలు

జీవితపు పరుగు పందెంలో గెలుపు గమ్యం చేరాలంటే పరిగెడుతూ నడక నేర్చుకోవాలిసిందే,
ఆగి నేర్చుకోవాలంటే పదుగురి వెనక నిలబడాలి లేదా గెలుపు వాకిట్లో ఆగిపోవాలి.

-----------------------------------------------------

నిన్ను నన్ను లోకాన్నీ కప్పిన ఆకాశం నా చిన్ని కన్నుల్లో,
ఆకాశం దాచుకున్న కళ్ళూ,అవి దాచుకున్న నేను నీ గుండె గుప్పిట్లో.

----------------------------------------------------

రంధ్రానికి గాలి తోడు రాగాన్నిచ్చినట్టు,
కోయిలకు వసంతపు రాక గొంతుక నిచ్చినట్టు,
నీ చూపు నా కంటికి ప్రేమ నేర్పింది.
నీ కలయిక నా జీవితానికి ప్రార్ధనలేని వరమయ్యింది.

---------------------------------------------------

నే నవ్వుతూ గడిపేస్తున్నప్పుడు
మండుటెండలో మంచులా కరిగే ఈ క్షణాలు
నే కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే మాత్రం
బండరాయిలా నిలుచుని అడుగు వేయవెందుకో???

26 November 2009

నేనెందుకు?


నిన్న స్నేహితుడి నుండి వచ్చిన ఈ-మెయిలులో పుట్టుకతోనే కాళ్ళూ,చేతులు లేని ఈ మనిషిని చూసి ఈయన విజయాల్ని చూసీ,అన్నీ ఉన్నా ఏదో తృప్తి లేకుండా, యే ప్రయత్నం లేకుండానే బాధలనే వృత్తపు బాటనెంచుకుని అందులోనే తిరుగుతూ,ఆలోచిస్తూ ఏమీ సాధించలేకపోతున్నామని దిగులుచెందే సగటు మనిషినీ(నాలోని నన్ను కూడా) చూసీ వెల్లువెత్తిన భావాలు


నేనెందుకు?

అడిగింది అమ్మ ఇవ్వలేదనీ
సినిమా టికెట్ మొదటి ఆట దొరకలేదనీ
ప్రతి ప్రయత్నానికి ఆటంకాలొస్తున్నాయనీ
రోజుకు ఇరవై నాలుగ్గంటలే ఉన్నాయనీ

తృప్తిలేని మనసుకీ
చేవలేని మాటకీ
ఆత్మవిశ్వాసపు పోటు పడ్డ గుండెకీ
మూతి బిగిసిన సీసా ప్రపంచంలో మనిషికీ

జీవింతమంతా ఒకే ప్రశ్న
నేనెందుకు?

నా పుట్టుకకే తొలి ప్రశ్న
నేనెందుకు?

జీవితపు తొలి అడుగు
పరిహసించిన పరిచయాలు
మరో అడుగు
నిలేసిన నీటి కళ్ళూ
మరో అడుగు
అపహాస్యపు అనుభవాలు
మరో నాలుగడుగులు

యేవి?
ఎక్కడ?

పరిహారమిచ్చుకుంటూ పరిహాసాలు
నన్నే అనుసరిస్తూ....
కలలదాటికి కావిడికెక్కిన కన్నీళ్ళు
దూరంగా కాటికెళ్ళే దారిలో....
అపహాస్యాల హాస్యవల్లరి
నేనెక్కిన ప్రతి విజయపు మెట్టుపై....

నా నోరు చెప్పదు
నేనెందుకో
నా నవ్వు చెప్పింది.

నా చేయి చెప్పలేదు
నేనెందుకో
నా విజయాలు చెప్పాయి.

నా కాలు చెప్పలేదు
నేనెందుకో
నా అడుగులు చూపాయి.

*Image is taken from a mail from Smiling Smilers (barcrott media)

21 November 2009

నా మాట


గుండెలోన తేనె మాట
గొంతు దాటితే నిప్పుమూట
మనసున మందనుకుంటే
మాటగ మారితే గాయమవునట
స్వరమాడే తైతక్కలు
తెచ్చునుగా తిప్పలు

గడుసు మాటల తాటాకులు
మనసుల మంటలు రాజేస్తే
పలుకులకే మౌనం నేర్పిస్తా
గళపువీణా తంత్రులనే తెంచేస్తా

పొందికగా పేర్చినప్పుడు ఇవేకదా కవితలు
శ్రావ్యంగా ఆలపిస్తే అవేకదా పాటలు
నా గొంతులో పలికినపుడే ఎందుకవి తూటాలు?
నా స్వరంలో ఆడినపుడే ఎందుకవి లావా ప్రవాహాలు?

20 November 2009

నేను కాని నేను

తెల్లారిందో నీ వెంట తిరిగే సూర్యుడ్ని నేను
చీకటి కమ్ముకుంటే హాయినిచ్చే వెన్నెల నేను
నీట మునిగితే ఆసరానిచ్చిన చెక్కను నేను
నింగి కెగిరితే అక్కరకొచ్చే రెక్కను నేను


నువ్వో దేవుడ్ని కొలిచేవేల నీ భక్తుడ్ని నేను
కన్నీరొలికే వేల దాచే కనుపాపను నేను
నవ్వులు చిలికే వేల తళుకుమన్న బుగ్గను నేను
చిరు వానలో తలపై నిలిచిన చినుకును నేను
కాలు కందనీయని కాలుకింది చెప్పును నేను


నీ జీవితంలో లేకున్నా కానీ
నీ ప్రతి భాధా నాది నీ ప్రతీ ఆనందం నాది
నీలో ఆశ చాలు నాకు శ్వాసగా
నీ కన్నీటి మంట చాలు నా చితికి నిప్పుగా